23-05-2025 12:04:58 AM
కులగణన డాటాపై నాలుగో సమావేశం
నెలరోజుల్లో పూర్తి నివేదిక
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): కులగణనలో వచ్చిన డేటాను విశ్లేషిస్తూ.. ఆయా ఉపకులాల వారీగా వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన ఇండిపెం డెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ నాలుగో సమావేశం గురువారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగింది. రిటైర్డు న్యాయ మూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఉన్న 243 ఉప కులాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించే సూచికల (సీబీఐ.. కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్)పై నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్కింగ్ గ్రూప్ లో మొత్తం 9 మంది ఫుల్‌టైం సభ్యులుండ గా.. సామాజిక శాస్త్రం, కులాల అధ్యయనం, చరిత్ర, పాలసీలు, చట్టాలు, ఆర్థికశాస్త్రం, గణాంకాలు తదితర అంశాలపై నిపుణులైనవారుకూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నా రు.
కులగణనలో వెల్లడైన సమాచారాన్ని క్రోఢీకరించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3.55 కోట్ల మంది ప్రజల నుంచి 75 రకాల ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 243 ఉపకులాలకు సం బంధించిన వ్యక్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది. 243 ఉపకులాల్లో.. 73 ఉపకులాలే మొత్తం జనాభాలో 96 శాతంగా ఉండటం గమనార్హం.
ఎస్సీల్లో 10 ఉపకులాలు, ఎస్టీ ల్లో 7 ఉపకులాలు, బీసీల్లో 45 ఉపకులాలు, ఓసీల్లో 11 ఉపకులాలు ఇందులో ఉన్నాయి. ప్రతీ ఉపకులానికి సంబంధించిన వెనుకబాటుతనాన్ని గుర్తించేలా ఈ సూచికలు (కాం పోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్) ఉండేలా రూపొందించారు. ఆయా ఉపకులాల వెనుకబాటుతనాన్ని తెలిపేలా అంశాలవారీగా, అంకెలవారీగా ఈ సూచికలు ఉండనున్నా యి.
ఇందుకోసం 43 నిర్దిష్ట ప్రమాణాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా ఏడు కేటగిరీల్లో పరిశీలిస్తున్నారు. వెనుకబాటుతనా నికి మండల్ కమిషన్ కేవ లం 11 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోగా.. ప్రస్తుతం వర్కింగ్ గ్రూప్ 43 ప్రమాణాలను పరిశీలిస్తుండటం విశేషం. కులగణనలో వెల్లడైన డేటా, సమాచారాన్ని ఈ వర్కింగ్ గ్రూప్ లోతుగా విశ్లేషించింది. వెనుకబాటుతనానికి కారణాలపై కూడా చర్చించింది.
ఈ నేపథ్యంలోనే ఏకగ్రీవంగా వెనుకబాటుతనం గుర్తింపు సూచికల (సీబీఐ)ను, డాటాను విశ్లేషించడానికి ప్రమాణాలపై నిర్ణయం తీసుకున్నారు. ఒక నెలలో పూర్తిస్థా యి నివేదికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం బహిరంగ పర్చకుండా మొత్తం సూచికల ద్వారా తెలిపేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించిన ఫార్మాట్‌ను తీసుకురావాలని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్ గ్రూప్ సూచన చేసింది.