calender_icon.png 15 September, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల యాప్ రెడీ

05-12-2024 01:26:34 AM

  1. నేడు ప్రారంభించనున్న సీఎం
  2. ఎల్లుండి నుంచి లబ్ధిదారుల ఎంపిక
  3. మంత్రి పొంగులేటి

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం తెలంగాణలో  ఎదురుచూస్తున్న పేదవాడి సొంతింటి కల సాకారం కానుంది. బడుగు, బలహీన వర్గాల మహిళలు  ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నీడలేని పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనలో సొంతింటి కలను నేరవేర్చేందుకుగాను  సర్కార్ లబ్ధిదారుల ఎంపికకు ‘మొబైల్ యాప్’ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం సచివాలయంలో ప్రారంభించ నున్నారు.

ఈ నెల 6వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని  మంత్రి పొంగులేటి బుధవారం విడుదల చేసిన ఒక  ప్రకటనలో తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 నుంచి 4 వేల  ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

మొదటి విడతలో నివాస స్థలం ఉన్న వారికి, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు రాష్ట్రంలో నాలుగేళ్లలో దశల వారీగా 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. 

ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ పేటెంట్..

 ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ‘  ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పార్టీనే పేటెంట్. ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, తండాకు వెళ్లినా, మారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్లే కనబడుతాయి. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతయితే.. మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు.

మేం గర్వంగా చెబుతున్నాం..  ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని చెబుతున్నాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి మొబైల్ యాప్‌ను రూపొందించాం.

ఈ యాప్‌లో లబ్ధిదారుల ఆర్థిక, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు వంటి అంశాలు ఉంటాయి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు  నిర్మించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేశాం ’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 

ఇంటి నిర్మాణానికి 5 లక్షలు.. 

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు, మహిళా పేరు మీదనే ఇంటిని మంజూరు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మిస్తామన్నారు. ‘ఇందిరమ్మ ఇంటికి నాలుగు దశల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం.

ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు’ అని తెలిపారు. 

 హౌసింగ్ శాఖ పునరుద్ధరణ.. 

 గత ప్రభుత్వం హౌసింగ్ శాఖను మూసివేసి ఆ శాఖ ఉద్యోగులను ఇతర శాఖలో విలీనం చేశారని  మంత్రి పొంగులేటి విమర్శించారు. 296 మంది ఉద్యోగులను తిరిగి నియమించామని, హౌసింగ్ శాఖను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2006--- ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

తెలంగాణలో 2006 నుంచి 2014 వరకు 23,85,188 ఇళ్లను మంజూరు చేయగా.. 19,32,001 ఇళ్లను పూర్తి చేసిందని తెలిపారు. ఇంకా 4,53,187 ఇళ్లు  వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు.