01-07-2025 02:30:04 AM
యాదాద్రి భువనగిరి జూన్30 ( విజయ క్రాంతి ) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు సంస్థాన్ నారాయణపురం మండలం కోతులాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ...ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఇంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక నాణ్యత కలిగిన ఇసుకను లబ్ధిదారులకు చేరేలా. మునుగోడు సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ లభించే నాణ్యత గల ఇసుక లబ్ధిదారులకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చూడాలని స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్ ను కోరారు. లబ్ధిదారులు మైక్రో ఫైనాన్స్ నుండి డబ్బు తెచ్చుకోకుండా మహిళా సంఘాల ద్వారా డబ్బులు తెచ్చుకొని ఇంటి నిర్మాణం పనులను చేపట్టాలన్నారు.
లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం డబ్బులు జమ చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసుకొని తోరణాలు కట్టి ఒక పండుగ వాతావరణంలో గృహ ప్రవేశం చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.