25 March, 2026 | 2:57 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

25-03-2026 01:22 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసే విధంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇంటి నిర్మాణ పరిస్థితులకు అనుగుణంగా రికార్డు చేసి బిల్లులు చెల్లించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. కురవి మండలంలో మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మొగిలిచర్ల గ్రామంలో మంజూరు అయిన 18 ఇందిరమ్మ ఇండ్ల లో ఇప్పటి వరకు 10 స్లాబ్ లెవల్, జగ్గయ్య తండాలో 15 మంజూరు కాగా, అందులో 9 స్లాబ్ లెవెల్ పూర్తి అయ్యాయని, మిగతా ఇంటి నిర్మాణం కోసం సంబంధిత ఏఈ, పంచాయతీరాజ్ రెవెన్యూ సిబ్బంది లబ్ధిదారులకు అవగాహన కల్పించి,ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని, పూర్తిచేసిన లెవెల్ వరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసి డబ్బులు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని సాధ్యమైనంత త్వరగా వారికి ఇండ్ల నిర్మాణానికి సహకరించి, మెటీరియల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే వసతి గృహాలు, విద్యాసంస్థలను అధికారులు తనిఖీ చేసి కామన్ డైట్ మెనూ, విద్య ఆరోగ్యం సానిటేషన్ తదితర అంశాలపై దృష్టి పెట్టి ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హనుమ నాయక్, కురవి తహసిల్దార్ విజయ, ఎంపీడీవో కె.వీరబాబు, మండల విద్యాశాఖ అధికారి బలాజీ ఉన్నారు. ఇక అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో నెల్లికుదురు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వైద్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.