16-07-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూలై 15(విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గొల్లపల్లి మండలం గుంజపడుగు, పెగడపల్లి మండలం నంచర్ల గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. ఇల్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను కలిసి ప్రభుత్వం అందించే తోడ్పాటు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి నిర్మాణం పనుల్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, హౌసింగ్ డి ఈ. భాస్కర్.ఎంపీడీవో లు, తహసిల్దార్లు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ సంబంధిత అధికారులుపాల్గొన్నారు.