12-08-2025 12:00:00 AM
రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి. గౌతమ్
హనుమకొండ టౌన్ ఆగస్టు 11 (విజయ క్రాంతి) : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలో నిర్మాణంలో ఉన్న పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పి డి సిద్ధార్థ నాయక్, అధికారులతో కలిసి రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ ఎండి పరిశీలించారు.
లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని, ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుకు రూ. 5 లక్షల ను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కాబట్టి లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులన త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లుల చెల్లింపునకు జరిగిన పనులకు పేమెంట్ చెల్లించే విధంగా ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత నిర్మాణ దశ ఫోటోలను అప్డేట్ చేయాలన్నారు.
అదేవిధంగా హనుమకొండ నగరంలోని 31వ డివిజన్ న్యూ శాయంపేటలో పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.