12-08-2025 12:54:23 AM
మహబూబాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి)/హుజురాబాద్/వీణవంక: రాష్ట్రం లో యూరియా కొరతతో రైతన్నలు రోడ్డె క్కి ధర్నాలు చేస్తున్నారు. ఒకపక్క వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతుంటే మరోపక్క యూరియా లేక సొసైటీలు, విక్రయ కేంద్రా ల వద్ద లైన్‌లో నిల్చోవల్సిన దుస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు. సోమవారం కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేశారు.
యూరియా కొరత లేదన్న ప్రభుత్వంపై మండిపడ్డారు. పంటలకు సరిపడా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లోని వ్యవసాయ సహకార సొసైటీలలో సరిపడా యూరియా అందకపోవ డంతో రైతులు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయ కుండా, యూరియా కొరత లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేదం టే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంన గర్ జిల్లా వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో సొసైటీ గోడౌన్ ముం దు యూరియా కోసం సోమవారం ఉద యం ఆరు గంటల నుంచే రైతులు బారులు తీరారు.
అయితే యూరియా ఇవ్వకుండా సొసైటీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీణవంకకు వెళ్లి టోకెన్ తీసుకోవాలని సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు జమ్మికుంట రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి సకాలంలో యూరియా అందించకుండా రోడ్డుపై ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
సొసైటీ కార్యాలయం ఒక దగ్గర, గోదాం మరొక దగ్గర ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఉదయం ఆరు గంటల నుంచి సొసై టీ గోదాం ముందు క్యూలో నిలుచున్నా సరిపడా యూరియా అందించడం లేదని సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలు రోడ్డుపై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు చేరుకొని యూరి యా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
తొర్రూరులో నిరసన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో సోమవారం సింగిల్ విండో ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు ఉదయం వచ్చిన రైతులు యూరియా కోసం నిరసన తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతపరిచి ఒక్కొక్కరికి రెండు, మూడు చొప్పున యూరి యా బస్తాలు ఇప్పించారు. సాయంత్రం వరకు 444 యూరియా బస్తాలను రైతులకు అందించారు. మరో 50 మంది రైతు లకు మంగళవారం పంపిణీ చేస్తామని ఏవో రామ నరసయ్య టోకెన్లు జారీ చేశారు.