గూగుల్‌లో ఇందిరమ్మ గృహాలు!
హైదరాబాద్, మే ౨౩ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు సంబంధించి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇళ్ల కేటాయింపు వరకు అంతా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి లో పరిశీలించిన అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు జియో మ్యాపింగ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ గ్రామంలో ఎన్ని ఇళ్లు కేటాయించాం.. ఎవరెవరికి ఇళ్లను కేటాయించాం. లబ్ధిదారు వివరాలతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపని కూడా జియోమ్యాపింగ్ చేయనున్నారు. దీని ద్వారా సదరు ఇళ్ల నిర్మాణలు ఎంత వరకు వచ్చాయి.. ఏదశలో ఉన్నాయి.. ఎన్ని పూర్తయ్యాయనే కచ్చితమైన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టకి తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వీటిలో ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు కేటాయించాలనేది మాత్రమే ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండగా లబ్ధిదారు ఎంపిక మాత్రం జిల్లా స్థాయి అధికారుల చేతిలో ఉండేలా చేస్తున్నారు. ఇప్పటికే ఏ పథకంలోనూ ఇళ్లు పొందని పేదలను గుర్తించి అసలైన అర్హులకు అందేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం గతంలో ఇళ్లు పొందని వారు 66 లక్షలు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చింది. వీరిలో 30 లక్షల మందికి కనీసం సొంత జాగా కూడా లేదని తేలినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లుఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తికావని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అందుకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. లక్ష ఇళ్ళకు రూ. 5 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా ప్రస్తుతం రూ.3 వేల కోట్లు మాత్రమే రుణం మంజూరు కాగా వీటిలో రూ.1500 కోట్లు మాత్రమే విడుదల కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతలో రూ.1000 కోట్లు విడుదల అవుతా యని ప్రభుత్వం అంచనా వేస్తోంది.దీంతో మొత్తం రూ.2500 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది.






