calender_icon.png 11 July, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల వేగం పెంచాలి

10-07-2025 05:18:04 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఇంజనీరింగ్, జిల్లా అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా పరిషత్, ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ తదితర శాఖ ద్వారా వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులకు మంజూరైన పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని అన్నారు. ఇంకా గ్రౌండింగ్ పూర్తికాని పనులకు సంబంధించి రెవిన్యూ, ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో నూరు శాతం గ్రౌండింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లో టాయిలెట్స్, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్ నిర్మాణం వంటి పనులు, పీఎంశ్రీలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల అభివృద్ధి పనుల కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మంజూరైన సైన్స్ ల్యాబ్ గదులు, కంప్యూటర్ గదులు అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ త్వరగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ భవనాల్లోకి మార్చిన 73 అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు అవసరమని, ఈ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మౌలిక వసతులు, అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఇంజనీరింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.