10-07-2025 05:15:22 PM
మంచిర్యాల (విజయక్రాంతి): బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జేబుకు నల్ల రిబ్బన్ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉండి బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేసిన పాపాన పోలేదనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అధికారం చేపట్టి 18 నెలలు అవుతుందని, రుణాలు విడుదల చేస్తున్నాం దరఖాస్తు చేసుకోండని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకొని రెండు నెలలు అవుతున్న సబ్సిడీ రుణాలు ఊసే లేకపోవడం బాధాకరం అన్నారు.
ఎంతో ఆశతో నిరుద్యోగ బీసీ యువత స్వయం ఉపాధికై దరఖాస్తు చేసుకొని రెండు నెలల కాలం అవుతున్న సబ్సిడీ రుణాలు విడుదల చేసిన దాఖలాలు లేవనీ, ఇప్పటికైనా బీసీ నిరుద్యోగ యువతకు రుణాలు విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ బీసీ నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ యువతతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజేల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, కీర్తి భిక్షపతి, చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం, లక్ష్మీనారాయణ, అంకం సతీష్, షేక్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.