calender_icon.png 29 October, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి

29-10-2025 08:00:38 PM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి..

నిజామాబాద్ (విజయక్రాంతి): అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం ఆయన అన్ని మండలాల ఎం.ఈ.ఓలతో విద్యా శాఖ పని తీరుపై ఒక్కో మండలం వారీగా సుదీర్ఘ సమీక్ష జరిపారు. టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్ సదుపాయం వంటి వసతులన్నీ ప్రతి బడిలో అందుబాటులో ఉండాలన్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేనిచోట వెంటనే వాటి నిర్మాణాలు జరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన చోట సత్వరమే పనులు చేపట్టేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రతి రోజు శత శాతం విద్యార్థులు హాజరును ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా చేయాలని, అందరు విద్యార్థులు ఆధార్ ను ఎన్ రోల్ చేయించి యూడైస్ పోర్టల్ లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. అలాగే, అన్ని యాజమాన్యాలు ఆధార్, అపార్ జెనరేట్ చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అపార్ జెనరేట్ చేయని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఏకరూప దుస్తుల స్టిచింగ్ సకాలంలో పూర్తి అయ్యేలా చొరవ చూపాలని, ఎక్కడైనా సివిల్ వర్క్స్ పనులు పెండింగ్ లో ఉంటే వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు.

బడులలో మద్యాహ్న భోజనం అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సరుకులు, కూరగాయల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, విద్యార్థులు ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హితవు పలికారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ, నాణ్యతతో కూడిన విద్యను బోధించేలా చూడాలన్నారు. పాఠశాలల పనితీరుపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. భవిత కేంద్రాల నిర్వహణ, వయోజన విద్య అమలు తీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎం.ఈ.ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ.ఐ.ఈ.ఓ రవికుమార్, డీ.ఈ.ఓ అశోక్, అన్ని మండలాల ఎం.ఈ.ఓలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.