calender_icon.png 10 December, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ అడ్డంకులు అధిగమించి రాష్ర్ట ఏర్పాటు

10-12-2025 03:02:28 AM

  1. ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చింది

తెలంగాణ ఏర్పాటు ప్రకటన ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది

ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకుంది

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు వర్చువల్‌గా ఆవిష్కరణ 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్‌గా ఆవిష్కరించారు. రాష్ర్టంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మొత్తం 18 అడుగుల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2009 డిసెంబర్ 9న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని, ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడంతోపాటు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

అందులో భాగంగానే గత ఏడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చామని, ఇప్పుడు రాష్ర్టంలోని అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నామని వివరించారు. 2004లో కరీంనగర్ గడ్డ పైనుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం కూడా డిసెంబర్ 9వ తేదే అని పేర్కొన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.

రాష్ర్టం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చారని గుర్తు చేశారు. స్వరాష్ర్ట కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ర్టం నంబర్ వన్‌గా రూపొందుతోందని, ప్రజా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోందని స్పష్టం చేశారు.