07-01-2026 07:27:19 PM
జైలు బదులు కమ్యూనిటీ సర్వీస్
ఎస్సార్ నగర్,(విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయస్థానం వినూత్నమైన శిక్షను విధించింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 20 మంది ద్విచక్ర వాహనదారులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన గౌరవ న్యాయస్థానం, జైలు శిక్షకు బదులుగా సమాజానికి మేలు చేసే విధంగా ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది.
మైత్రీవనం జంక్షన్ వద్ద అవగాహన కార్యక్రమం
కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు అమీర్‌పేట మైత్రీవనం జంక్షన్ వద్ద శిక్ష పడిన వాహనదారులు కమ్యూనిటీ సర్వీస్‌లో పాల్గొన్నారు. “మద్యం సేవించి వాహనం నడపరాదు”, “మీ ప్రాణం మీ కుటుంబానికి ముఖ్యం” అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనదారులు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు.
పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఈ కార్యక్రమాన్ని నార్త్ & వెస్ట్ జోన్ ట్రాఫిక్ అడిల్ డిసిపి వై. వేణుగోపాల్ రెడ్డి మరియు పంజాగుట్ట డివిజన్ ACP కె. హరి ప్రసాద్ గారు స్వయంగా పర్యవేక్షించారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల తప్పు చేసిన వ్యక్తికే కాకుండా, ఎదుటివారి ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇలాంటి వినూత్న శిక్షల ద్వారా వాహనదారుల్లో బాధ్యతాయుతమైన మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తప్పు ఒప్పుకున్న వాహనదారులు శిక్ష పడిన వాహనదారులు తమ తప్పును గుర్తించి, ఇకపై మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేశారు.