11-12-2025 09:46:37 PM
వృద్ధులతో సౌహార్దంగా మాట్లాడిన సూర్యాపేట ఎస్పీ నరసింహ ఐపీఎస్..
చివ్వెంల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద గ్రామంలో జరుగుతున్న పోలింగ్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రాకపోకలు, పోలీసుల భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సరళిని ఆయన సమీక్షించారు. ఓటు హక్కు వినియోగించేందుకు కేంద్రానికి వచ్చిన వృద్ధులను ఎస్పీ స్వయంగా పలకరించి, చేయి అందించి స్నేహపూర్వకంగా మాట్లాడారు. వృద్ధులు కూడా ఎస్పీతో మాట్లాడుతూ తమ ఓటు అనుభవాలను ఆనందంగా పంచుకున్నారు. వృద్ధులను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదని ఎస్పీ నరసింహ గుర్తుచేశారు. జిల్లాలో పోలింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు.