calender_icon.png 4 November, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకం..

04-11-2025 08:27:43 PM

డీఈఓ రవీందర్ రెడ్డి..

జూనియర్ కళాశాలల్లో ముమ్మర తనిఖీలు..

సిద్దిపేట (విజయక్రాంతి): విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అత్యంత ముఖ్యమైన దశ అని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా ప్రత్యేక అధికారి, మేడ్చల్ డిఐఈఓ కిషన్ తో కలిసి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీలు ఈనెల 15 వరకు కొనసాగుతాయని, ప్రిన్సిపల్ అధ్యాపకులు సమయపాలన, బోధనలో మెలకువలను పాటిస్తూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కళాశాలలో వసతులు, ఎఫ్ ఆర్ ఎస్, యుడైస్, టీచింగ్ డైరీలు, కళాశాల రికార్డులు అధ్యాపకుల హాజరు, తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయని, హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించే లక్ష్యంలో భాగంగా అన్ని కళాశాలల ప్రిన్సిపల్స, అధ్యాపకులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు.

అధ్యాపకులు గడువులోగా సిలబస్ పూర్తి చేయాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. కళాశాలకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత మూడు నెలలు కీలకమని విద్యార్థుల పట్ల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా డిఐఓ రవీందర్ రెడ్డి గజ్వేల్ లోని కళాశాలలు తనిఖీ చేయగా ప్రత్యేక అధికారి కిషన్ పట్టణంలోని పలు ప్రైవేట్, మైనార్టీ, రెసిడెన్షియల్ కళాశాలలను తనిఖీ చేసి పలు సూచనలు సలహాలు అందించారు.