calender_icon.png 26 July, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి

26-07-2025 01:32:28 AM

- గేమ్ ఛేంజర్‌గా ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ 

- మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలో అపార అవకాశాలు

- ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలి

- ‘తైవాన్’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తై వాన్ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును  తైవాన్ టెక్స్ టైల్ ఫెడరేషన్(టీటీ ఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘స్వల్ప కాలంలోనే టెక్స్ టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటు గా ఎదిగింది.

రాష్ర్ట పారిశ్రామిక జీఎస్‌వీఏ 2024 రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో టెక్స్ టైల్ రంగం కీలక పాత్ర పోషించింది. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతోంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్(కేఎంటీపీ) గేమ్ ఛేంజర్‌గా మారింది. ప్రపంచపటంలో తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తోంది’ అని వివరించారు. ‘కేఎంటీపీలో జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ అన్నీ ఒకేచోట పూర్తిచేసేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం.

టెక్స్ టైల్ దిగ్గజ కంపెనీలు యంగా న్, కైటెక్స్, గణేషా ఎకోస్పియర్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. రవాణా సౌకర్యాలపరంగా కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్  నాగ్ పూర్  విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుసంధానంగా ఉంటుంది. ఫంక్షనల్ టెక్స్ టైల్స్, ఎకో డైయింగ్, టెక్స్ టైల్ రీసైక్లింగ్ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి’ అని చెప్పారు. 

తెలంగాణ తైవాన్ మాన్యుఫాక్చరింగ్ జోన్

‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. కస్టమైజ్డ్ ల్యాండ్ పార్సిల్స్, ప్లగ్ అండ్ ప్లే యూనిట్స్, నైపుణ్య మానవ వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక పరిస్థితులు పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తు న్నాయి. టెక్స్ టైల్స్, టెక్నికల్ టైక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్(ఈఎస్‌డీఎం), సస్టునబుల్ మాను ఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ అండ్ ఆర్ అండ్ డీ తదితర రంగాల్లో తైవాన్ కంపెనీలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుంది’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ తైవా న్ మాన్యుఫాక్చరింగ్ జోన్’, ప్రత్యేక టైక్స్ టైల్ క్లస్టర్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి టీటీఎ ఫ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో రాష్ర్ట పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, టైక్స్ టైల్స్ డైరెక్టర్ ధరణి, టీటీఎఫ్ సెక్షన్ చీఫ్ ఆర్థర్ చి యాంగ్, తైవాన్‌కు చెందిన టైనాన్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, లీలీ గ్రూప్, ఆల్కేమీ తైవాన్ లిమిటెట్, సింగ్ యోంగ్ హో ఎంట ర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, ఫార్ ఈస్టర్న్ న్యూ సెంచరీ కార్పొరేషన్, లిటిల్ కింగ్ గ్లోబల్ కంపెనీ లిమిటెడ్, యూ బంగ్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.