16-10-2025 08:26:18 AM
ఉత్తదే అయిన విచారణ..!
హాజరు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడు
16కు వాయిదా వేసిన అధికారి
విచారణలో వ్యక్తమవుతున్న అనుమానాలు...
మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాలలోని ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై బుధవారం విచారించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ఇలాగ వచ్చి.. అలాగ వెళ్లిపోయారు... 15న విచారణ ఉంటుందని సొసైటీలోని సభ్యులకు నోటీసులు ఇది వరకే జారీ చేసిన సదరు అధికారి విచారణకు హాజరు కాని, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యక్తి (సొసైటీలో సభ్యుడు) హాజరు కాకపోయినా ఏం చర్య తీసుకోకుండా గమ్మునుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఉత్తదే అయిన విచారణ..!
కాలేజ్ రోడ్ లోని కల్లు డిపోలో బుధ వారం ఉదయం 11 గంటల వరకు సభ్యులందరు హాజరు కావాలని కోరిన అధికారి విచారణకు ఆలస్యంగానే హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చిన ఆ అధికారి సంఘంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కోల రాజాగౌడ్ అనే సభ్యుడు కన్వీనర్ ముసుగులో ముఖేష్ గౌడ్ సొసైటీ డబ్బులు తీసుకుంటున్నాడని, వాటి లెక్కల వివరాలతో పాటు మరికొన్ని అంశాలపై కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి తీసుకుపోయిన ఫిర్యాదు, అదే వారంలో రాజాగౌడ్ సొసైటీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, సంఘం నుంచి అతని పేరును తొలగించాలని పొడేటి శ్రీనివాస్, ఇతర సభ్యులు బీసీ డెవలప్ మెంట్ అధికారికి చేసిన ఫిర్యాదు అంశం, మార్క లచ్చాగౌడ్, ఇతర సభ్యులు సైతం రాజాగౌడ్ పై ఫిర్యాదు చేసిన అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ విచారించిందేందో తెలియడం లేదు. హాజరు కాని సభ్యుడి కోసం విచారణను ఈ నెల 16కు వాయిదా వేసినట్లు సమాచారం.
విచారణలో వ్యక్తమవుతున్న అనుమానాలు...
విచారణ అధికారిగా వచ్చిన దేవేందర్ సభ్యుల నుంచి తీసుకున్న రికార్డుల పుస్తకాలను తన వద్ద ఉంచుకుంటున్నానని చెప్పి అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వర్గానికి చెందిన వ్యక్తికే రిజిష్టర్లు అందజేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారి ఈ విషయాన్ని‘మామూలు’గా తీసుకోవడం వల్లే ఆ వర్గానికి రికార్డులు అందించారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ రికార్డులు తీసుకొని వారికి అందజేయడానికే ఉత్తుత్తి సమావేశం ఏర్పాటు చేసి వారికి అప్పగించారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆ బుక్కులోని పేజీలు చించడం, ఇతర మ్యాటర్ జతచేసి ఇచ్చే అవకాశం ఉంది. మార్పులు చేసి ఇస్తే ఎవరు బాధ్యులు, అధికారి వద్ద ఉండాల్సిన రికార్డులు వారికి ఇవ్వడంలో మతలాబేమిటో ఆ అధికారికే తెలియాలి. ఇక న్యాయం ఎక్కడ జరుగుతది..? విచారించి న్యాయం చేయమని ఆదేశించిన కలెక్టర్ ఆదేశాలకు ఇదేనా విచారణ పద్దతి అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ను వివరణ కోరేందుకు పలు మార్లు ఫోన్ లో సంప్రదించినా సమాధానం ఇవ్వలేదు.