calender_icon.png 16 October, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేలకొరిగిన తెలంగాణ ఉద్యమ కెరటం

16-10-2025 08:29:34 AM

తెలంగాణ ఉద్యమకారుడు రైలు ప్రమాదంలో మృతి

ఉద్యమానికి ఈ ప్రాంతంలో బాటలు వేసిన వ్యక్తి వెంకటేశ్వర్లు

జార్ఖండ్ రాష్ట్రం కడోర్మా ప్రాంతంలో ఘటన

గరిడేపల్లి:  సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కీత వెంకటేశ్వర్లు బుధవారం రైలు ప్రమాదంలో మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి చురుకైన పాత్ర పోషించారు.వ్యక్తిగత పనులపై వెంకటేశ్వర్లు ఢిల్లీ వెళ్తుండగా మార్గమధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలోని కడోర్మా ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి ప్రమాదానికి గురై చనిపోయినట్లు తెలిసింది.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కేసీఆర్ కి మద్దతుగా ఈ ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమ పోరాటంలో తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో వెంకటేశ్వర్లు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు.తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని,వరంగల్ జిల్లాను జయశంకర్ జిల్లాగా ప్రకటించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.నాగార్జునసాగర్ లోని నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ చెరువు కట్టపై నిరాహార దీక్ష చేపట్టాడు.ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం  జరుగుతున్న సమయంలో కొంత మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యాడు.

నిరంతరం తెలంగాణ అంటూ,ఉద్యమం అంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వర్లు ఒక సందర్భంలో  మానసిక స్థితిని కోల్పోయినట్లు అందరూ భావించారు.వెంకటేశ్వర్లు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి కార్యక్రమాన్ని పాలుపంచుకున్నాడు.వెంకటేశ్వర్లు రైలు ప్రమాదంలో చనిపోవడం పట్ల మండల బిఆర్ఎస్ నాయకులు, మలిదశ ఉద్యమ కారులు సంతాపం వ్యక్తం చేశారు.జార్ఖండ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు.ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటం ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో చనిపోవడం స్థానికులను కలచివేసింది.