15-10-2025 12:00:00 AM
రాత్రి వరకు కొనసాగిన సంతకాల సేకరణ...
మంచిర్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి ) : మంచిర్యాల పట్టణంలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఈ నెల 15న విచారణ జరిపేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ సొసైటీలోని సభ్యులకు నోటీసులు ఇది వరకే జారీ చేశారు. కాలేజ్ రోడ్ లోని కల్లు డిపోలో బుధ వారం ఉదయం 11 గంటల వరకు సభ్యులందరు హాజరు కావాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు మంగళ వారం రాత్రి వరకు సంఘంలోని సభ్యులతో రికార్డులపై సంతకాలు చేయించినట్లు తెలిసింది. కొందరు సభ్యులు ఇన్ని రోజులుగా చూపించని లెక్కలకు ఇప్పుడు సంతకాలెందుకు అని ప్రశ్నిం చగా సముదాయిస్తూ సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన కథనాలకు ఆలస్యంఋగానైనా అధికారులు స్పందించడంతో సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు..
అవినీతి, అక్రమాలపై విచారణ జరుగకుండా కల్లు గీత కార్మిక నూతన సంఘం అంశం లేవనెత్తి విచారణను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నట్లు తెలియవచ్చింది. కోల రాజాగౌడ్, పొడేటి శ్రీనివాస్, మార్క లచ్చాగౌడ్ లు ఫిర్యాదు చేసిన అంశాలపై విచారణ జరుపకుండా రాజాగౌడ్ ను సంఘం నుంచి తొలగించేందుకు సభ్యులను మభ్యపెడుతున్నట్లు సమాచారం.
ఏండ్ల తరబడి ప్రభుత్వానికి ఎలాంటి లెక్కలు చూపించ కుండా మెక్కిన వ్యక్తులపై విచారణ ఏ మేరకు సాగుతుందో వేచి చూడాల్సిందే. విచారణ సమయంలో సంఘం లెక్కల బుక్కులు తీసుకువచ్చేది ఎవరనేది మరో ప్రశ్న సభ్యులు లేవనెత్తుతున్నారు. సంఘంలో అధికారికంగా 39 మంది సభ్యులున్నట్లు ప్రకటిస్తుంటే 2024 సంవత్సరం లీజు ప్రకారం మొదటి ఏడాదికి రూ. 12.50 లక్షలు, రెండవ సంవత్సరం రూ. 13.25 లక్షలు ఎంత మందికి ఎంతెంత పంచారనే భయటపడనుంది.
అంతే కాకుండా కన్వీనర్ పేరిట నెలకు రూ. 2.80 లక్షలను ఎంత మందికి, ఏ పని కోసం పంచారో.., ఎవరు మెక్కారో వెలుగులోకి రానుంది. ఈ విచారణ కోసమే సంఘం సభ్యులు ఎదురు చూస్తున్నారు.