15-10-2025 12:00:00 AM
బెల్లంపల్లి, అక్టోబర్ 14: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధి లో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్మించిన కాలక్షేప మండపం పనులు అసంపూర్తి దశలో ఉండగానే అధికారులు కాంట్రాక్టర్ కు పూర్తి స్థాయి బిల్లులు చెల్లించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2022లో రూ. 50 లక్షల అంచనా వ్యయం తో సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్ ) నిధులతో బుగ్గలో కాలక్షేప మండపం పనులను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు.
రెండు దశల్లో పనులు పూర్తిచేసి అప్పగించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ ఒక దశలో మాత్రమే పనులను అసంపూర్తిగా పూర్తి చేసినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. మొదటి దశలోనే పనులను చేపట్టిన కాంట్రాక్టర్ కు రూ. 40 లక్షలకు పైగా బిల్లులను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు చెల్లించారు. కాలక్షేప మండపం పనులను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రూ. 7.50 లక్షల నిధుల(బిల్లు)ను చెల్లింపును నిలిపివేశారు.
సిజిఎఫ్ ( సామాజిక ప్రయోజన నిధి) నిధులతో దేవాలయాల నిర్వహణ, పునర్నిర్మాణం పనులకు వినియోగిస్తారు.డీ పురాతన శివాలయంగా పేరొందిన బుగ్గ దేవాలయంపై భాగం శిథిలావస్థకు చేరడంతో దేవాలయం మరమ్మతు పనులు పూర్తి చేయించి కాంట్రాక్టర్ కు నిలిపివేసిన రూ. 7.50 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
కానీ బుగ్గ శివాలయం పై భాగంలో మరమ్మతులు రూ. 7.43 లక్షల ధార్మిక సామాజిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన సిజిఎఫ్ నిధులను కాంట్రాక్టర్ కు చెల్లించారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివాలయానికి మరమ్మత్తులు జరపకపోవడంతో వాన కురిస్తే గర్భగుడిలో నీరు చేరి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరగా శివాలయం మరమ్మతులకు సంబంధించి సిజిఎస్ లో రూ. లక్షా నలభై వేలు ఉన్నాయని, ఆలయ మరమ్మతులు పూర్తి చేశాకే ఈ నిధులను కాంట్రాక్టర్ కు చెల్లిస్తామని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక అధికారి తెలిపారు.