calender_icon.png 26 January, 2026 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం ఖమేని

26-01-2026 02:31:48 AM

  1. దూసుకొస్తున్న అమెరికా సైనిక బలగాలు
  2. కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

టెహ్రాన్, జనవరి 25: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా సైనిక బలగాలు ఇరాన్ వైపు దూసుకొస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇరాన్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికా దాడిచేసే అవకాశం ఉండడంతో తమ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు.ఖమేనీని అత్యంత సురక్షితమైన భూగర్భ బంకర్‌లోకి తరలించారు.

టెహ్రాన్‌లోని ఒక పటిష్టమైన సొరంగ మార్గంలోకి ఆయన్ని తరలించారు. ఈ భారీ కట్టడం యుద్ధ సమయంలో గరిష్ట రక్షణ ఇచ్చేలా రూపొందించారు. ప్రభుత్వానికి అత్యంత సన్నిహిత వర్గాలు ఈ సమాచారాన్ని వెల్లడించాయి.కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ధ నౌకల సమూహం పశ్చిమాసియా వైపు వస్తోందని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే ఇరాన్‌పై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే విమాన వాహక నౌక అబ్రహం లింకన్ హిందూ మహాసముద్రానికి చేరుకుంది. ఖమేనీ బంకర్‌లోకి వెళ్లడంతో అధికార బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. ఆయన మూడవ కుమారుడు మసౌద్ ఖమేనీ ప్రస్తుతం తండ్రి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలతో సంప్రదింపుల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఇరాన్ సైన్యం కూడా అప్రమత్తమైంది. తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రివల్యూషనరీ గారడ్స్ ప్రకటించాయి.

దాడి జరిగితే అత్యంత కఠినంగా స్పందిస్తామని హెచ్చరించాయి. ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని స్పష్టం చేశాయి.ఇరాన్ లోపల కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.