29-09-2025 12:51:50 AM
-నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు కు వందేళ్లు పూర్తి
-ప్రాజెక్టు కట్టపై ఏర్పడుతున్న భారీ గుంత
-పట్టించుకోని అధికారులు
-ప్రాజెక్టు భద్రతపై స్థానికుల ఆందోళన...!
నిజాంసాగర్, సెప్టెంబర్ 28( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలోని అతి పురాతనమైన నిజాంసాగర్ ప్రాజెక్టు భద్రతపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు కు సరియైన మరమ్మత్తులు లేని కారణంగా శిథిలావస్థకు చేరే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టుపై గుంతలు పడిన అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురవడంతో పాటు భారీ వరద ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుండడంతో చిన్న చిన్న గుంతలు పెద్ద గుంతలుగా మారి ప్రాజెక్టు కట్ట పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నిజం సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకు...?
నూతన ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిజాం కాలంలో నిర్మించిన 100 సంవత్సరాలు పూర్తయిన నిజాంసాగర్ ప్రాజెక్టును కాపాడుకోవడంలో అధికారులు, పాలకులకు భద్రతపై చిత్తశుద్ధి లేదనేది జగమెరిగిన సత్యం. గత నెల రోజుల నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో తరచూ వరద గేట్లు మోరాయిస్తున్నాయి. దానికి తోడు ప్రాజెక్టు కట్టపై ఉన్న రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డుపై మోకాళ్ళోదు గుంతలు ఏర్పడడంతో ప్రాజెక్ట్ భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోకాలులోది గుంతలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న సంబంధిత అధికారులకు పట్టనట్లు కనిపిస్తోంది. పురాతన ప్రాజెక్టుపై చిన్నపాటి గుంతలు ఏర్పడ్డ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్న ఇవేమీ తమకు పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. గతంలో నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో సిబ్బంది తక్కువ ఉండడంతో సరియైన మరమ్మత్తులు చేయలేదు.
ఇప్పుడు గతంలో పనిచేసిన గ్రామ సేవకులను నీటిపారుదల శాఖ లో విధుల్లోకి తీసుకోవడంతో సరిపడా సిబ్బంది ఉన్నారు. సిబ్బంది ఉన్న తాత్కాలిక మరమ్మత్తు పనులు చేయడంలో ఇబ్బంది ఏమిటనేది అధికారులకే తెలియాలి. చిన్నపాటి మరమ్మత్తుల సైతం నిర్లక్ష్యం చేస్తూ పోతే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇకనైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి నిజాంసాగ ర్ ప్రాజెక్టుపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రాజెక్టు భద్రతను కాపాడుతారో లేదో వేచి చూడాల్సిందే.
ప్రాజెక్ట్ కట్ట భద్రంగానే ఉంది
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కట్ట భద్రంగానే ఉంది. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చిన్న చిన్న ఏర్పడిన గుంతలను పూడ్చి వేయిస్తాం. ఆ గుంతల వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు.
సులేమాన్, ఈ ఈ, నీటిపారుదల శాఖ, నిజాంసాగర్ ప్రాజెక్టు, కామారెడ్డి జిల్లా