14-07-2025 12:13:50 AM
- యూనివర్సిటీ లేని ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
- చదువుల తల్లి కొలువైన ఉమ్మడి జిల్లాలో వర్సిటీ కరువు
ఆదిలాబాద్, జూలై 13 (విజయ క్రాంతి) : అడవుల జిల్లా ఆదిలాబాద్ అంటేనే... ఆదివాసీలు. అలాంటి ఆదిలాబాద్‌కు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ గతంలో పాలకులు ప్రకటన సైతం చేశారు. కానీ యూనివర్సిటీ ఏర్పాటు కల నేటికి నెరవేరకపోవడంతో, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కల కలగానే మిగిలిపోనుందా అని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు అనువైన ప్రాంతాల అధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నియమించిన ప్రొఫెసర్ల కమిటీ ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నత విద్య సంస్ధల ఏర్పాటుకు అనువైన అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని దింతో జిల్లాకు గిరిజన యూనివర్సిటీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కాకపోవడం పాలకుల చిత్తశుద్దికి అద్దంపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో యూని వర్సిటీ లేని ఏకైక జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిలిచింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహజసిద్ద ప్రకృతి వనరులకు, అడవులకు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధి. సింగరేణి బొగ్గు గనులు, సున్నపురాయి, కాగితపు పరిశ్రమ, మాంగనీస్ గను లు విస్తరించాయి. పెన్ గంగా, గోదావరి, ప్రాణహిత, పెద్దవాగు నదులున్నాయి. మూడు కాలాల్లో నమోదయ్యే భిన్నమైన వాతావరణ స్థితిగతులు పరిశోధనలకు నెలవు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కల్గిన చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం లేకపోవడంతో ఈ ప్రాంత వాసులు ఉన్నత చదువుల కోసం అష్టకష్టాల నడుమ ఉమ్మడి జిల్లాను దాటి వేరే జిల్లాలకు వెళ్తున్నారు.
మరికొంత మంది ఆర్థికభారం, దూరభారం వల్ల మధ్యలోనే చదువులకు స్వస్తి పలుకుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో అంబేద్కర్ విశ్వవిద్యాల యం అధ్యయన కేంద్రాలు, దూర విద్యాకేంద్రాల ద్వారా పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయే తప్పితే పూర్తి స్థాయి పీజీ కోర్సుల కళాశాలలు లేకపోవడం ఉన్నత చదువుకు ప్రతికూలంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
చేజారిన గిరిజన వర్సిటీ..?
అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న ఉమ్మడి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, సుమారు మూడు లక్షల యాభై వేలకు పైగా గిరిజనులు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా మహారాష్ట్ర, ఛత్తీషుగఢ్‌లతో సరిహద్దును పంచుకోవడం, జిల్లా గుండా జాతీయ రహదారి 44 తో పాటు ఇతర రహదారులు వెళ్లడం, దక్షిణ మధ్య రైల్వే లైన్ జిల్లా నుండి వెళ్లడం, యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూములు ఉన్నప్పటికీ గిరిజన విశ్వవిద్యాలయం జిల్లాలో ఏర్పాటు చేయించడంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సంవత్సరం నవంబర్ 17న జీవో 797 ను విడుదల చేసింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2011 ఆగస్టు 27న జీవో 783 ని జారీ చేసింది. దీంతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని గుర్తించింది.
జిల్లా రాజకీయ నేతల నిర్లక్ష్యంతోనే..
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు కావాల్సిన యూనివర్సిటీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ములుగు జిల్లాకు తరలించుకుపోయారు. ఉట్నూర్ లో ఏర్పాటు కావా ల్సిన గిరిజన విశ్వవిద్యాలయంను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధుల, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కారణంగానే ములుగు జిల్లాకు తరలిపోయిందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకై పాలకులపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయలేకపోవడంతోనే జిల్లా నుండి గిరిజన యూ నివర్సిటీ తరలిపోయిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు కోసం ఉద్యమాలు చేసామని ఈ ప్రాంత ఆదివాసీ, గిరిజన సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీ కాలేజీ మూసివేత
శ్యామ్ పిట్రోడా నేతృత్వంలోని నాలెడ్జ్ కమిషన్ సిపార్సుల మేరకు ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయలు ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణాన్ని ఎంపిక చేశారు. దీనికి కారణం అప్పటికే కాకతీయ యూనివర్సిటీ కి అనుబంధంగా పీజీ కళాశాల భవనం ఉండటం, సుమారు 25 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ భవనంలో వసతులు, సౌకర్యాలకు కోదవలేకపోవడం సమీపంలో మరింత ప్రభుత్వ స్థలం ఉండటం వలన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయవచ్చని భావించి మొదటి విడతగా 55 కోట్లు నిధులను కేటాయించారు. అప్పటి ప్రభుత్వ సిఫార్సుతో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పేరుతో సరస్వతి విశ్వవిద్యాలయం అని పేరును సైతం ప్రకటించా రు. కానీ ఆ సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన అర్ధాంతరంగా నిలిచిపోయింది. సుమారు రెండు దశాబ్దాల పాటు నిర్మల్ కేంద్రంగా నడిచిన కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ప్రభుత్వ పీజీ కాలేజీ సైతం ప్రస్తుతం మూతపడింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒకే ఒక పీజీ సెంటర్ కూడా మూతపడింది.
హైదరాబాద్ జే.ఎన్.టీ.యూకు అనుబంధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవో నంబర్ 67 ను విడుదల చేసింది. కళాశాల ఏర్పాటు అవుతుందన్న తరుణంలో స్థల సేకరణ జరగక అది మరుగున పడింది. అ తర్వాత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కళాశాల ఏర్పాటు ప్రతిపాదన మరుగునపడిపోయింది.నిర్మల్‌కు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త నంగే శ్రీనివాస్ శ్రీ జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితిని ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా సరస్వతీ విశ్వవిద్యాలయం పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలుమార్లు ఉన్నత అధికారులను, కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులను కలిసి యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖ పత్రిక ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత పై విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలతో చర్చా వేదిక ను నిర్వహించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సిందే అని తెలిపారు.
వర్సిటీ ఏర్పాటు చేయాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గతంలో కేటాయించిన గిరిజన యూనివర్సిటీని ఎట్టి పరిస్థితిలో ఏర్పాటు చేయాలి, దీనికోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. రానున్న రోజుల్లో సైతం ఉద్యమాలు చేపడతాం. ఇటీవల జరిగిన చర్చా వేదిక అనంతరం విద్యావేత్త, సామాజిక కార్యకర్త బద్దం పురుషోత్తం రెడ్డి సారథ్యంలో యూనివర్సిటీ సాధన జేఏసీ ని ఏర్పాటు చేసింది. వీరు త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రమణ గౌడ్ గొడిసెల,యూనివర్సిటీ సాధన జేఏసీ జిల్లా కో-కన్వీనర్