14-07-2025 01:23:06 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొస్తుంది..మరోవైపు అధికార కాంగ్రెస్ నాయకుల మధ్య రాష్ట్రంలో వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో వైరం కొనసాగుతోంది. ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం.. వారికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసు లు ఇవ్వడం జరుగుతోంది.
అయి తే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వచ్చిన ఫిర్యాదులపై చర్చించేందుకు భేటీలు జరుగుతున్నా నాయకుల మధ్య నెలకొన్న వివాదాలకు మాత్రం పుల్‌స్టాప్ పడటం లేదు. పార్టీ నేతలు తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించే..పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపైనే ఫిర్యాదు చేయడం..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనురుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో తీవ్ర దుమారాన్నే లేపాయి.
ఇది ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మరి కొందరిని టార్గెట్‌గా చేసుకుని బీఆర్‌ఎస్ విమర్శలకు దిగింది. దీంతో అధికార కాంగ్రెస్ అప్రమత్తమై పార్టీకి నష్టం జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టి.. బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగింది. అనిరుధ్‌రెడ్డికి నోటీసు ఇచ్చి పార్టీ వివరణ కోరింది. ఇక ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయితీ కాంగ్రెస్ పార్టీకి కాస్త తలనొప్పిగా మారింది.
మంత్రి కొండా సురేఖ భర్త మురళి.. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో కొండా మురళికి వ్యతిరేకంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులకు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ, కొండా మురళి కూడా కడి యం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు.
పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఇరువురికి నోటీసులు ఇవ్వడం, వారి నుంచి వివరణలు తీసుకోవడం జరిగింది. అయితే కొండా మురళి గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చి..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్లినప్పుడు పదవికి రాజీనామా చేయాలని, తాను బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పడంతో పార్టీలో మరో వివాదానికి దారితీసింది.
కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి రావడం, ఆయన కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో కడియం వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మమ్ములనే తిట్టి..మమ్మల్నే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం. తిట్టినవాళ్లను వదిలిపెట్టి.. తమను వివరణ కోరడం ఏంటీ’ అని ఏకంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీనే నిలదీశారు.
దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సిందిపోయి..నాయకుల మధ్య నెలకొన్న సమస్యను మరింత జఠిటం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్‌లు ప్రొత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు వ్యతిరేకంగా అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు అన్ని విధాలుగా సహకారమందిస్తూ.. స్థానికంగా కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారని గాంధీ భవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. అదిలాబాద్‌కు చెందిన రావి శ్రీనివా స్‌పై గాంధీభవన్‌కు ఫిర్యాదు వచ్చిన వెంట నే..విచారణ జరిపి అతన్ని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
ఇదే విధానం మిగతావారిపై ఎందుకు అనుసరించడం లేదని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. కరవమంటే కప్పకు కోపం.. విడమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిందని, నేతల మధ్య నెలకొన్న పంచాయితీ పరిష్కారం పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కత్తిమీది సాములాగానే మారిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.