1 May, 2026 | 8:39 PM

ఇంత క్రూరత్వమా?

07-02-2025 12:00 AM

అక్రమవలసదారులను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన 104 మందిని అమెరికా ప్రత్యేక సైనిక విమానంలో భారత్‌కు తిప్పి పంపిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. కాళ్లు, చేతులు బంధించి తమను విమానంలో కుక్కి తరలించారంటూ భారత్‌కు చేరుకున్న వారు చెప్పడమే ఈ వివాదానికి కారణం.

భారత్‌కు అమెరికా మిత్ర దేశమని గొప్పగా చెప్పుకొంటున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. వచ్చేవారం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండడం, గతంలో మోదీ, ట్రంప్‌ల మధ్య ఉన్న సాన్నిహిత్యం,

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ప్పుడు మోదీ ఆయనను ప్రియమిత్రుడిగా సంబోధిస్తూ అభినందన సందేశం పంపడం ఇవన్నీ గమనించిన వారికి అమెరికా సర్కార్ వైఖరి సహజంగానే ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ విషయంలో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు గురవుతోంది.

ఈ 104 మందిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ భారత్‌కు తిప్పిపంపనున్న విషయం కేంద్రానికి ముందే తెలుసు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని అమెరికా తిప్పి పంపింది.

అలాంటప్పుడు వారిని తీసుకు రావడానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపించి ఉండవచ్చు కదా? గతంలో ఉక్రెయిన్‌లో, గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకు రావడానికి డజన్ల సంఖ్యలో ప్రత్యేక విమానాలను ప్రభుత్వం పంపించింది.

మరి ఇప్పుడు ఎందుకు పంపలేదనేది చాలామంది అనుమానం. అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారులను భారత ప్రభుత్వం కూడా నేరస్థులుగానే పరిగణిస్తోందా? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అమెరికానుంచి భారత్‌కు చేరుకున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

వారి దీనగాథలు వింటే కడుపు తరుక్కు పోతుంది. ఏజంట్ల మాటలకు మోసపోయి లక్షలు చెల్లించి వెళ్లిన వీరు అమెరికా భూమిపై అడుగుపెట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. మైళ్ల కొద్దీ కాలినడక, చిన్నబోటులో ప్రా ణాలు పణంగా పెట్టి ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టిన వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు చీకటి గదుల్లో బంధించారు.

అక్కడ వేలాది మంది పంజాబీ యువకులు, పిల్లలు కనిపించారని, అందరిదీ ఒకటే దుస్థితి అని సుఖ్‌పాల్ సింగ్ అనే పంజాబ్ యువకుడు చెప్తూ, ఇలా అక్రమమార్గంలో ఎవరూ విదేశాలకు వెళ్లొద్దని వేడుకొన్నాడు.

కాగా అక్రమవలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు  వేసిన దృశ్యాలు మీడియాలో రాగానే  కేంద్ర ప్రభుత్వం మొదట వాటిని ఖండించింది. కానీ అమెరికా స్పందించిన తర్వాత ఒప్పుకోవలసి వచ్చింది. తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని,

ఇది తమ విధానమని భారత్‌లోని అమెరికా ఎంబసీ ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల విమానప్రయాణం గురించి ఇంతకు మించి ఏం చెప్పలేమని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. దీంతో కేంద్రప్రభుత్వం కూడా నష్టనివారణ చర్యలు చేపట్టింది.

ఈ విషయంలో గురువారం రాజ్యసభలో  విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ ప్రకటన చేస్తూ  అమెరికానుంచి అక్రమవలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదని చెప్పారు. వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూడడానికి అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పడం గమనార్హం.

అంటే ఇప్పుడు వచ్చిన వారి పట్ల ట్రంప్ ప్రభుత్వం కొలంబియాలాంటి మిగతా దేశాల వారిలాగానే ప్రవర్తించిందనేది స్పష్టమవుతోంది. ఈ విషయంలో అగ్రరాజ్యానికి మానవీయ కోణం, మానవ హక్కులు లాంటివి ఏవీ గుర్తుకు రావా?మిత్రదేశమైనా, శత్రుదేశమైనా నేరస్థులపట్ల ఒకేలా వ్యవహరిస్తామని చెప్పకనే చెప్తోంది.

మరి మోదీ అమెరికా పర్యటనలో ఈ విషయాన్ని ట్రంప్ వద్ద ప్రస్తావిస్తారా? లేదంటే అగ్రరాజ్యంతో దోస్తీయే ముఖ్యమనుకొని లక్షలాది భారతీయుల సమస్యను గాలికి వదిలేస్తారో చూడాలి.