09-07-2025 06:28:43 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్రంలో పేద ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూరుతుందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(MP Porika Balram Naik), ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కేవలం వారి కుటుంబ ప్రయోజనం కోసమే పని చేసిందని, ఈ విషయాన్ని గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పట్టం కట్టారని వివరించారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం జనరంజకమైన పాలన అందిస్తుందని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని వివరించారు.
మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రారంభించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డివైసిసి అధ్యక్షుడు సురేష్ నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మహబూబాబాద్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షులు మిట్ట కంటి రామిరెడ్డి, అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.