calender_icon.png 10 July, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లై స్కామ్ పై ఈడీకి ఫిర్యాదు చేస్తాం

09-07-2025 11:46:15 PM

మాజీ మంత్రి గంగుల కమలాకర్..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర సివిల్ సప్లై శాఖలో జరిగిన కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్(Former Minister Gangula Kamalakar) చెప్పారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మి రూ.7,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు 90 రోజులు గడువు విధించారని ఆయన అన్నారు. ఇప్పటికే 605 రోజులు గడిచినా ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. క్వింటాల్‌కు రూ. 2,007లు ధర నిర్ణయించగా రూ. 2,230లకు టెండర్లు దక్కించుకున్న వాళ్లు మిల్లర్ల నుంచి వసూల్ చేశారని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందించారని ఆయన ఆరోపించారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గడువు ముగిసినా టెండర్లు ఇప్పటి వరకు రద్దు చేయలేదన్నారు. బిల్డర్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఈ అంశంపై వచ్చే సోమవారం ఈడీతో పాటు అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ స్కాంపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సివిల్ సప్లై కుంభ కోణంలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దేశంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు తమకు ఆహ్వానం లేదన్నారు. దాదాపు రూ. 410 కోట్లకు సంబంధించి బిడ్డర్లు, రైస్ మిల్లర్ల అకౌంట్ల లావాదేవీలకు సంబంధించి ఆధారాలున్నాయిని, ఈ కేసు నుంచి రేవంత్, ఉత్తమ్ తప్పించుకోలేరని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు.