09-07-2025 11:15:55 PM
ఇరవై రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత..
అక్కన్నపేటలో విషాదం..
హుస్నాబాద్: విధి వక్రీకరించింది. బతుకుదెరువు కోసం తాటిచెట్టు ఎక్కిన ఆ గీతకార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి, సుమారు 20 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. సిద్దిపేట జిల్లా(Siddipet District) అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మాటూరి సదానందం(53) బుధవారం మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. గత నెల 19వ తేదీన కల్లు గీసేందుకు ఎప్పటిలాగే తాటిచెట్టు ఎక్కాడు సదానందం. కానీ ఆ రోజు ఆయనకు చివరి పనవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి సదానందం చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడాడు. అతని పరిస్థితి కొంత మెరుగుపడడంతో ఐదు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నాడు.
కొంత కోలుకుంటున్నాడని భావిస్తున్న తరుణంలో, బుధవారం సదానందం ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత తట్టి లేపినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ ఇంటికి పెద్ద దిక్కును, ఆసరాను కోల్పోయామని బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నిత్యం అందరితో కలివిడిగా ఉంటూ, తన ఆప్యాయ పలకరింపులతో ఆత్మీయతను పంచిన సదానందం మరణం గ్రామంలో శోకాన్ని నింపింది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.