09-07-2025 06:31:34 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రతి గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టెలిఫోన్ బాక్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని 2025-26 విద్యా సంవత్సరానికి 268 గురుకులాల్లో ఫోన్ మిత్ర ప్రారంభించారు. దీనిలో భాగంగా బుధవారం కాసిపేట గురుకులంలో ఫోన్ మిత్రాను ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ" అమ్మతో ఒక మాట" అనే ఉద్దేశంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫోన్ మిత్ర ద్వారా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
దీనికోసం ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక కార్డు ఇచ్చామన్నారు. మా గురుకులంలో 6 ఫోన్ మిత్ర బాక్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడడానికి సెక్షన్ వారిగా సమయం కేటాయించామన్నారు. విద్యార్థులకు అందజేసిన కార్డులో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ కు మాత్రమే ఫోన్ చేసే అవకాశం ఉంటుందనీ, సొసైటీ లక్ష్యం పిల్లల ఒంటరితనాన్ని దూరం చేసి తల్లిదండ్రులను ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండేలా చేసి పిల్లల దృష్టి ఇంటిపైన కాకుండా చదువుపైన కేంద్రీకరించడానికి ఈ సౌకర్యంఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ మిత్ర ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.