17-05-2025 12:31:22 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నివేదికలను పరిశీలించిన తర్వాత కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలు స్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో జరిగినందున అప్ప టి సీఎం కేసీఆర్, సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను విచారణకు పిలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయి తే ఇప్పటికే ముఖ్యమైన అధికారులు, కాంట్రాక్టర్లు, నిపుణులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. కీలక సాక్ష్యాధారాలను సేకరించిం ది.
దాదాపు నివేదిక తుది దశకు చేరుకున్న ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దల విచారణ అవసరం లేదని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ నెలాఖరులోగా తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సమర్పిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలపాటు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది.
ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండ టంతో ఈ దఫాలోనే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత సర్కారు పెద్దల తీరును ఎన్డీఎస్‌ఏ రిపోర్టు తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాల్సి వస్తుందేమోనని పెద్ద ఎత్తున చర్చ జరిగినా చివరకు కమిషన్ ఇక విచారణలు ఆపేసి నివేదిక సిద్ధం చేసే పనిలో ఉందన్న సమాచారం బీఆర్‌ఎస్ వర్గాలకు సంతో షాన్నిస్తోంది.
కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా? పిలిస్తే ఆయన హాజరవుతారా? అనే ప్రశ్నలకు ఇంతటితో తెర పడినట్టుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగింపు దశకు వచ్చిన వేళ మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.