17-05-2025 12:29:11 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): పహెల్గాంలో ఉగ్రచర్యతో అమాయకులను బలి తీసుకున్న పాకిస్థాన్‌కు మన దేశం ఆపరేషన్ సిందూర్‌తో సరైన గుణపాఠం నేర్పిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతి దాడి ఎంత బలంగా ఉంటుందో ఆపరేషన్ సిందూర్‌తో అర్థమయ్యేలా బుద్ధి చెప్పినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో సాక్షాత్తు మంత్రే ఫైళ్లు కదలడానికి పైసలు తీసుకోవడం కామన్ అని పేర్కొనడంపై విస్మయం వ్యక్తంచేశారు. ఒక మంత్రే కమీషన్లు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమ వుతుందన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నేపాల్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసి ఆప్ఘన్ కు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసిన ఉగ్రవాదులు కూడా ఆపరేషన్ సిందూర్‌లో హతమయ్యారని తెలిపారు. పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల వల్ల జమ్మూకశ్మీర్‌లోనే 46 వేల మంది ప్రా ణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐఎ స్‌ఐ ప్రేరిత ఉగ్రవాదులు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని చెప్పారు. గతంలో ఉగ్రదా డుల తర్వాత క్యాండిల్ లైట్లు వెలిగించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మిస్సుల్స్‌తో బదులిస్తున్నామని చెప్పారు.
రక్షణరంగంలో గొప్ప మార్పు
దేశం రక్షణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, రక్షణ స్టార్టప్స్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అత్యాధునిక ఆయుధాలు, వసతులు అందిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్పష్టంగా ప్రపంచం ముందు కనిపిస్తున్నాయని చెప్పారు.
గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం ఎదురైన ఇబ్బందుల నుంచి నేడు సైన్యానికి రఫెల్ ఫైటర్ జెట్లు, బ్రహ్మోస్ క్షిపణులు సమకూర్చామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించడంతోపాటు వారిలో మానసిక ధైర్యాన్ని పెంచి అండగా నిలబడేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
శనివారం నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక ప్రముఖులను రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించామని చెప్పారు. తిరంగా యాత్ర ప్రజల కార్యక్రమమని, ఒక కేంద్రమంత్రిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా తాను.. తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలిపారు.