calender_icon.png 25 August, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అసమర్థత పాలన వల్లే రాష్ట్రంలో యూరియా కొరత

25-08-2025 01:29:37 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..

నకిరేకల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వలనే రైతులకు యూరియా కొరత నెలకొన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former MLA Chirumarthi Lingaiah) విమర్శించారు. సోమవారం కేతేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోజులు తరబడి ఎరువుల కోసం క్యూలలో నిలబడి అవస్థలు పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. నాలుగు నెలల క్రితమే రైతుల అవసరాలు తెలిసినా, ఎరువులను సమయానికి రప్పించడంలో నిల్వ ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల సమస్యలపై అసలు పట్టింపు లేదన్నారు. కేంద్రం నుండి యూరియా కోటా రప్పించడంలోనూ కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు.

రైతు కోసం యూరియా దొరకడం లేదు, దళారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మాటలు కోటలు దాటిన చేష్టలు మాత్రం గుండుసున్నా అన్నారు. నల్లగొండ జిల్లాకు రావాల్సిన నీరు వృధాగా పోతున్నా జిల్లా మంత్రులకు సోయిలేదున్నారు. అబద్ధాలు, అమలు కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సీటును కాపాడటం కోసమే రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అధికార యంత్రాంగం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసి, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి, బడుగుల శ్రీనివాస్ యాదవ్, మారం వెంకట్ రెడ్డి, బొప్పాని సురేష్, బంటు మహేందర్, కొండేటి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.