25-08-2025 01:24:24 PM
చండూరు: 'తినగ తినగ వేము తియ్యగనుండు', 'చదువ చదువ సభలందు రంజిల్లు' అన్నారు ప్రజాకవి వేమన. వేమన చెప్పిన మాటలను అక్షరాల నిజం చేశారు చొల్లేడు నివాసి నారగోని సైదులు. పుట్టి పెరిగిన ఊరిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని, మునుగోడు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను పూర్తి చేసుకొని, రామకృష్ణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. తెలుగు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. విద్యను పూర్తి చేసుకొని.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఉన్న బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ఆచార్య కె. ఆశాజ్యోతి పర్యవేక్షణలో "ముకుంద రామారావు సాహిత్యం - ఒక పరిశీలన" అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
ప్రాథమిక విద్య నుంచి పిహెచ్.డి. విద్య వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఎదురైన ప్రతి సమస్యను అధిగమిస్తూ, చొల్లేడు గ్రామం నుంచి డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తిగా ఘనత సాధించారు. ఈ సందర్భంగా డాక్టర్. నారగోని సైదులు తల్లిదండ్రులు నారగోని దుర్గయ్య- పార్వతమ్మ, భార్య రేణుశ్రీ, తమ్ముళ్లు ప్రసాద్ - కృష్ణలతోపాటు బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన బిడ్డకు 1వ తరగతి నుంచి పిహెచ్.డి. స్థాయి వరకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రతి గురువుకు ధన్యవాదాలు తెలియజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించి, ప్రభుత్వ హాస్టల్ భవనాల్లో చదువుకుంటూ ఈ రోజు దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకోవటం గర్వంగా ఉందన్నారు.