calender_icon.png 19 November, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరువు హత్య కాదిది.. కానీ అలాంటి కథే!

16-11-2025 12:00:00 AM

అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమాను వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయిలు కంపాటి చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

మాది వరంగల్ జిల్లా. చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆస క్తి ఉండేది. అప్పు డు 16 టీన్స్, సం పంగి లాంటి సినిమాలు చూసి ఆకర్షితుడినయ్యాను. మా ఊరికి చెందిన మిత్రు డొకరు అప్పటికే నాగార్జున ‘గ్రీకువీరుడు’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసేవారు. సినిమాల పట్ల నా ఆసక్తిని గమనించి ఆయనే నన్ను ప్రోత్సహించారు. 

బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా, నా మనసంతా సినిమాలవైపే ఉండేది. కొన్ని స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం మొదలుపెట్టా. మొదట్లో కమర్షియల్ స్క్రిప్ట్స్ గురించి ఆలోచించినా, ఆ తర్వాత మనదైన నేటివిటీ, మన ఆత్మ ఆ సినిమాలో కనిపించాలనిపించింది. ఆ తరహా స్క్రిప్ట్స్ రాయడం ప్రారంభించా. డైరెక్టర్లు వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాల దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. ఒకరోజు వేణుకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి, ఒక డెమో షూట్ చేసుకుని రమ్మన్నారు. అలా సినిమా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్ వాళ్లు కూడా మా ప్రాజెక్టులోకి వచ్చారు. 

అప్పట్లో మా దగ్గర సొసైటీలో గొడవ జరిగితే అన్నలు (నక్సలైట్లు) వచ్చి కొట్టి, బెదిరించి ఆ సమస్యను పరిష్కరించేవారు. ఈ కథలో బాధిత కుటుంబం వాళ్లను కలిసి ఇలా సినిమా చేస్తున్నానని అడిగితే, చేయండి కానీ మా పేర్లు, ఫొటోలు బయటకు రాకుండా చూడమని కోరారు. 2004లో నేను చిన్నవాన్ని. అప్పుడే ఈ ఘటన జరిగింది. -ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుని ‘రాజు వెడ్స్ రాంబాయి’ అని రాసుకుంటాడు. ఈ ప్రేమకథలో చివరకు ఏమైందనే తెరపైనే చూడాలి. 

హీరో అఖిల్ మా వరంగల్ జిల్లావాస్తవ్యుడే. ఒక స్నేహితుడి ద్వారా అతని ప్రొఫైల్ చూశాను. రాజు క్యారెక్టర్‌కు కావాల్సిన ఈజ్ అఖిల్‌లో కనిపించింది. రాంబాయి పాత్ర కోసం మాత్రం చాలా మందిని వెతకాల్సివచ్చింది. హీరోయిన్ తండ్రి పాత్ర కోసం చైతన్య జొన్నలగడ్డను తీసుకున్నాం. ఆయన యూఎస్ నుంచి తిరిగివచ్చిన ఆ టైమ్‌లో మా ఆఫీస్‌కు కలిశారు. స్టుల్‌గా ఉన్నప్పటికీ ఆయనలో ఒక సైక్ లుక్ కనిపించింది. హీరోయిన్ తండ్రిది దివ్యాంగుడి పాత్ర. చైతన్యతో అప్పటికప్పుడు ఒక చిన్న శాంపిల్ సీన్ చేయించాం. బాగా చేశాడు.. తీసుకున్నాం. కొన్ని వర్క్‌షాప్స్ తర్వాత ఆ క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్‌గా చేశాడు. 

ఈ సినిమా చిత్రీకరణ నిరుడు ప్రారంభించాం. సగం షూట్ అయిన తర్వాత వర్షాలు, వరదలు వచ్చి మేం షూటింగ్ చేసిన ఊరు బాగా నష్టం వాటిల్లింది. మిగతా షూటింగ్ కోసం అదే ఊరిలో షూటింగ్ చేయాలి కాబట్టి పరిస్థితులు చక్కబడేదాకా వేచి చూశాం. అలా షూటింగ్ ఆలస్యమైంది. అయితే వరదలు రావడాన్ని చెడుగా భావించి, ఊరిలో షూటింగ్ వద్దు అంటూ గ్రామస్తులు వారించారు. వరద ప్రభావం పూర్తిగా తగ్గేవరకూ ఆగి ఊరివాళ్లను బతిమాలి మళ్లీ షూటింగ్ చేశాం. 

నాకు మన మూలాలతో అనుబంధం ఉన్న కథలంటే ఇష్టం. మన నేటివ్ లవ్‌స్టోరీతో తెరకెక్కించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా బాగా వచ్చేందుకు మా టీమ్ బాగా సహకరించారు. వేణు, బన్నీ వాస్, వంశీ నందిపాటి సినిమా ఔట్‌పుట్ చూసి ఆనందం వ్యక్తంచేశారు. నా తర్వాతి సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ ప్రాజెక్టును ప్రకటిస్తాను.