calender_icon.png 19 November, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారణాసి.. రుద్ర

16-11-2025 12:00:00 AM

మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందుతు న్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘వారణాసి’ పేరును ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఏర్పాటుచేసిన భారీ ఈవెంట్‌లో ఈ సినిమా విశేషాలను టీమ్ ప్రకటించింది.

ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ వేదికపై బిగ్‌స్క్రీన్ ద్వారా ‘వారణాసి’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇందులో మహేశ్ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించారు.

ఆయన రుద్ర పాత్రలో థ్రిల్ చేయనున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక మందాకినిగా నటిస్తున్న ఈ సినిమాలో ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ అలరించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దుర్గాఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. 

నా జీవితంలో ఒక్కసారే చేసే సినిమా, పాత్ర ఇదే

‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో ‘వారణాసి’ కథానాయకుడు మహేశ్‌బాబు మాట్లాడుతూ.. “నాన్న (కృష్ణ) నన్నెప్పుడూ ఓ మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. 

ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారే చేసే సినిమా, పాత్ర ఉంటుంది. నాకు ‘వారణాసి’ అలాంటిదే. దీనికోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. మరీ ముఖ్యంగా నా దర్శకుడు గర్వపడేలా శ్రమిస్తా. విడుదలైనప్పుడు ఈ సినిమా చూసి యావత్తు దేశం గర్వపడుతుంది” అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు ప్రతి సినిమాకూ ప్రెస్‌మీట్ పెట్టి కథ చెప్పేవాడిని. కానీ ఈ సినిమాకు మాటలు సరిపోవు. ఈ కథను మాటల్లో చెప్పడం అసాధ్యం. ప్రేక్షకుల అంచనాలు సెట్ చేయడానికే ఈ వీడియోను చేశాం.

చిన్నప్పుడు కృష్ణ గొప్పతనం తెలియలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆయన పునాది వేసిన టెక్నాలజీ రివల్యూషన్స్ అర్థమయ్యాయి. అలాంటి లెజెండ్ కొడుకు మహేశ్‌బాబుతో ఇప్పడు సినిమా చేస్తున్నా.. కొత్తదనం, పెద్దపాటి విజన్ చూపించకుండా ఎలా? బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను 1.90:1 ఫార్మాట్‌లో షూట్ చేశాం. కానీ ఇది పూర్తిగా ఫుల్‌స్క్రీన్ ఐమాక్స్‌లో తెరకెక్కించబోతు న్నాం.

నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. నాన్న హనుమంతుడు నడిపిస్తాడని అన్నప్పుడు కోపం కూడా వచ్చేది. కానీ, ఈ సినిమా రాస్తున్నప్పుడు.. కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ రాస్తుంటే నేను నేల మీద లేను. మహేశ్‌బాబు రాముడిలా కనిపించాడు. గూస్‌బంప్స్ వచ్చాయి. మహేశ్ మనిషితనం గురించి మాట్లాడాలి. ఎంత పెద్ద స్టార్ అయినా సెల్‌ఫోన్‌కి బానిస కావడం లేదు. సెట్‌లో ఉన్నంతసేపు ఫోన్ తన చేతిలో ఉండదు. మన అందరం నేర్చుకోవలసిన గుణం అది. నీలా ఉండటానికి నేను కూడా ప్రయత్నిస్తా మహేశ్‌” అన్నారు. విజయేంద్రప్రసాద్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాతలు తదితరులు మాట్లాడారు.