10-01-2026 12:00:00 AM
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందే రాజకీయ వేడి మొదలైనట్లుగా అనిపిస్తున్నది. బెంగాల్‌లో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం. తాజాగా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయం, సంస్థ డైరెక్టర్ ప్రతీక్‌జైన్ నివాసంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. సోదా సమాచారం తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ ప్రతీక్‌జైన్ నివాసానికి వెళ్లి ఈడీ వర్గాల ఎదుట నిరసన చేయడం ఆసక్తి కలిగించింది.
ఆ తర్వాత ఐ-ప్యాక్ కార్యాలయంలోకి వెళ్లిన మమతా అప్పటికే ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వమే కావాలనే ఇదంతా చేయిస్తుందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ సంస్థ బెంగాల్‌లో తృణముల్ పార్టీ ఐటీ, ప్రచార బాధ్యతల్ని చూస్తోంది.
మరో రెండు నెలల్లో బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి ఐ-ప్యాక్‌కు అందజేసినట్లు తృణముల్ పార్టీ పేర్కొంటుంది. దాడుల పేరుతో తమ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎత్తుకుపోయేందుకే ఈడీ వచ్చిందని తృణముల్ వాదిస్తోంది.
అయితే ఈడీ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, తాము కేవలం బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి జరిగిన లావాదేవీలను పరిశీలించడానికే ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చామని తెలిపారు. కేసులో నిందితుడిగా ఉన్న హవాలా నిర్వాహకుడు ఒకరు ఐ-ప్యాక్‌తో రూ.కోట్లలో నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని తెలిపింది. అయితే సీఎం మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ కలిసి తమ విచారణకు అడ్డంకులు సృష్టించారని ఈడీ పేర్కొంది. తాము ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదని, ఎన్నికలకు..ఈ సోదాలకు సంబంధం లేదని తెలిపింది.
చట్టప్రకారమే తాము మనీలాండరింగ్ ఆరోపణలపై సోదాలు నిర్వహించినట్లు ఈడీ స్పష్టం చేసింది. బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ మైన్స్‌లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు తేలడంతో 2020లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఐ-ప్యాక్‌పై దాడులను నిరసిస్తూ బెంగాల్‌లో సీఎం మమత శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టడంతో రాజకీయం మరింత వేడెక్కింది.
ఈసారి బెంగాల్‌లో జరగబోయే ఎన్నికల్లో తృణముల్ సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అక్రమ వలసలు అరికట్టేందుకు ఇటీవలే బెంగాల్‌లో ఓటర్ల సమగ్ర సవరణ (సర్)ను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 58.20 లక్షల ఓట్లు తొలగించింది. సర్ ప్రక్రియను వ్యతిరేకించిన మమత ‘సర్’ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నకిలీ ఓట్ల కంటే అసలు ఓట్లు ఎక్కువగా తొలగించారన్నారు.
ఈసారి ఎన్నికల్లో మమ్మల్ని ఓడించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఇదంతా చేస్తుందని ఆరోపించింది. అయితే నకిలీ ఓట్లను తొలగించడమే తమ లక్ష్యమని, అందుకోసం ఎంతదూరమైనా వెళ్తామని కేంద్రం పేర్కొంది. మొత్తంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికలకు ముందే బెంగాల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.