04-08-2025 01:38:28 AM
పెరిగిన పర్యాటకుల రద్దీ
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
నాగార్జునసాగర్, ఆగస్టు 3: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారి కొత్త అందాలను సంతరిం చుకుంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా రావడంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నది శాంతించింది. దీంతో శ్రైశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద నీరు తగ్గింది.
ఆదివారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా.. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో క్రస్ట్ గేట్లను క్రమంగా తగ్గిస్తూ ఆదివారం 11 గంటలకు పూర్తిగా నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 586 అడుగుల వద్ద ఉన్నది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 300 టీఎంసీలులు ఉంది.
పెరిగిన పర్యాటకుల రద్దీ
నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు నాగార్జున సాగర్ డ్యాంకు తరలివచ్చారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రికమండేషన్ సంబంధించిన వాహనాలను పంపించే పనిలోనే సెక్యూరిటీ ఉన్నారని పర్యాటకులు అంటున్నారు.
వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పటికీ పర్యాటక కేంద్రం దగ్గరకు వెళ్లని వ్వడం లేదని కొంతమంది పర్యాటకులు అసహనం వ్యక్తం చేశారు. కాగా, మీడియాకు కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. నాగార్జున సాగర్ వద్ద సిఆర్పిఎఫ్ పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీక్షకులు చెబుతున్నారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చిన్న పిల్లలతో వచ్చిన వారు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండతో మరో వైపు ట్రాఫిక్‌తో పర్యాటకులు చాలా అవస్థలు పడుతున్నారు.