7 August, 2026 | 2:29 AM

మానవత్వాన్ని చాటిన జగ్గారెడ్డి

07-08-2026 12:00 AM
  1. అర్ధరాత్రి పసికందు ప్రాణం కాపాడిన నేత 
  2. కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయాలని ఆదేశం

సంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): అర్ధరాత్రి వేళ ఓ పసికందుకు సకాలంలో చికిత్స అందేలా చేసి, ఆపదలో తానున్నాన్న పేరును మరోమారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్థకం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి వేళ ఓ చంటిబిడ్డను ఎత్తుకొని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం ఓ మహిళ వచ్చింది. ఎటువెళ్లాలో తెలియక చంటిబిడ్డను ఎత్తుకొని గేటువద్ద ఉన్న మహిళల వార్డులో దీనంగా నిలబడింది.

ఇంతలో దేవుడు పిలిచినట్లు జగ్గారెడ్డి అర్థరాత్రి సమయంలో తనిఖీలకు వచ్చారు. ఇంతలో మహిళ పరిస్థితిని గమనించారు. ఏమైందని ఆరాతీశారు. ఆమె తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన జగ్గారెడ్డి తన కారులో మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తల్లిబిడ్డలను తీసుకువెళ్లి, రెండో అంతస్తులోని పిల్లల వార్డులో చేర్పించి, వైద్యులకు చికిత్సలు చేయాలని ఆదేశాలిచ్చారు.

వెంటనే వైద్యులు చికిత్సలు మొదలు పెట్టారు.అనంతరం డ్రైవర్ అయిన మహిళ భర్తతో జగ్గారెడ్డి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆసుపత్రికి రావాలని సూచించారు. దీంతో జగ్గారెడ్డిలోని మానవత్వాన్ని పలువురు కొనియాడారు.