10-10-2025 12:38:44 AM
రైల్వే లైన్ భూనిర్వాసితుల పరిహారం చెల్లింపులో జాప్యం తో కోర్టు ఆదేశాలు. జగిత్యాల అర్బన్, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయములో రెవెన్యూ అధికారులు జాప్యం చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు గురువారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామాగ్రిని కోర్టు అధికారులు జప్తు చేశారు.
2003 సంవత్సరంలో కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణ సమయంలో జగిత్యాల మండలం లింగంపేటకు చెందిన 200 మంది రైతుల నుండి సుమారు 100 ఎకరాల భూమిని సేకరించారు. దీనికిగాను ఎకరానికి రూ.1,24,000 నుండి 1,30,000 వేలు చెల్లించేందుకు నిర్ణయించి 2006 లో అవార్డు చేశారు.అయితే తమకు నష్టపరిహారం సరిపోదని రైతులు జగిత్యాల కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఎకరానికి రూ. 10,64,800 చెల్లించాలని 2010లో తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ జగిత్యాల ఆర్డీవో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ఎకరానికి రూ. 15 లక్షల 99 వేలు చెల్లించాలని 2014లో తీర్పునిచ్చింది. దీనిని కూడా సవాలు చేస్తూ ఆర్డీవో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే సుప్రీం కోర్టు సివిల్ కోర్టు ఇచ్చిన రూ. 10, 64,800 నష్టపరిహారాన్ని ఖరారు చేస్తూ 2018లో తీర్పును వెలువరించారు. అయితే అధికారులు మాత్రం 1 మే 2019 న ఎకరానికి 1,24,000 మాత్రమే చెల్లిస్తూ రైతుల పేరు మీద డిపాజిట్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగతా పరిహారాన్ని చెల్లించాలని రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో గురువారం ఆర్డిఓ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అధికారి లక్ష్మారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కోర్టు ఆదేశాలను ఆర్డిఓ మధుసూదన్ కు అందజేసి కార్యాలయ ఫర్నిచర్ ను కంప్యూటర్లను, దస్త్రాలను జప్తు చేసి కోర్టుకు తరలించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ విలువైన భూములను తక్కువ ధరకే స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమికి తగిన విలువను పరిహార రూపంలో ఒకేసారి చెల్లించాలని, లేదా తమ కోల్పోయిన భూమికి బదులుగా మరోచోట భూమిని కేటాయించాలని డిమాండ్‌చేశారు.