14-07-2025 07:29:59 PM
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి..
అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత..
కామారెడ్డి (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్(SFI State President Rajinikanth) అన్నారు. సోమవారం కామారెడ్డిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పట్టింపు లేని ధోరణి అవలంబిస్తున్నాయని అన్నారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాల, పాఠశాలలో చదివిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేకుంటే పోరాటం ఆగదని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్తూ చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా మాయమాటలు చెప్పకుండా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆందోళన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొద్దు నిద్రను విడనాడి విద్యార్థులకు చెల్లించాల్సి బకాయి పడిన స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.