14-07-2025 06:55:31 PM
తలసాని..
సనత్‌నగర్ (విజయక్రాంతి): నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయ వద్ద పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్బంధాల మధ్య పండుగలు, జాతరలను నిర్వహించడం వలన భక్తులు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. భక్తులు సంతోషంగా భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకునేలా స్వేచ్చాయుత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుండి భక్తులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాకుండా బోనాల ఉత్సవాలను ఘనంగా, సంతోషంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
గంటల తరబడి భక్తులను దర్శనం కోసం వెళ్లకుండా అడ్డుకోవడం, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమ్మవారికి తొలిపూజ, హారతిని కూడా సకాలంలో నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. అమ్మవారి దర్శనం, బోనాల సమర్పించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉందన్నారు. జాతర నిర్వహణ, ఏర్పాట్లలో భాగస్వాములైన దేవాదాయ, పోలీసు, ట్రాఫిక్, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులకు సేవలందించిన వాలంటీర్ లు, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, BRS పార్టీ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, మహేష్ యాదవ్, మహేందర్ తదితరులు ఉన్నారు.