calender_icon.png 17 January, 2026 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాగృతి

17-01-2026 04:35:18 PM

- లబ్ధి పొందిన నేతలే కవితను విమర్శించడం సిగ్గుచేటు

- మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతాం

- జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్

గజ్వేల్: రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా జాగృతి ఎదుగుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు యదేచ్ఛగా కొనసాగుతుండగా, గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు విమర్శించారు. పార్టీలో ముఖ్య నేతలుగా ఎదిగిన కొందరు అందినంత దోచుకుని కార్యకర్తల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపించారు. అలాగే గత ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో విఫలం చెందగా, ప్రజా కోర్టులో వారి చర్యలు ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి సత్తా చాటనుండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తమ పార్టీ దీటుగా రూపుదిద్దుకోనున్నట్లు చెప్పారు. అయితే 42 శాతం రిజర్వేషన్ పేరుతో బీసీలకు కాంగ్రెస్ ద్రోహం తలపెట్టగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చైతన్యం చేస్తామని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని, రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు తగిన బడ్జెట్ కేటాయించడంతోపాటు అన్ని రంగాల్లో రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తమ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితతో ప్రయోజనం పొందిన వారే ప్రస్తుతం ఆమెను విమర్శిస్తుండడం సిగ్గుచేటని వివరించారు.