calender_icon.png 17 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ సమాచార్‌పై ఈ‘ఢీ’

17-05-2025 01:24:55 AM

  1. గుజరాత్ సమాచార్ కో ఓనర్ బాహుబలి షాపై మనీలాండరింగ్ ఆరోపణలు
  2. అరెస్ట్ చేసిన ఈడీ.. గంటల వ్యవధిలో బెయిల్ మంజూరు
  3. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని ఆరోపించిన కాంగ్రెస్, ఆప్

గాంధీనగర్, మే 16: గుజరాత్‌లో అతిపెద్ద దినపత్రిక అయిన ‘గుజరాత్ సమా చార్’ వ్యవస్థాపకుడు బాహుబలి షా (73) ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బాహుబలి షాకు మనీ లాండరింగ్ కేసుతో సంబం ధం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. 15 కంటే ఎక్కువ కంపెనీలతో సంబంధాలున్న షాను.. ఆ కంపెనీల్లో రెయిడ్స్ చేసిన తర్వాతే అదుపులోకి తీసుకున్నారు.

షాను అరెస్ట్ చేసిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఈడీ అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అతడికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అతడికి ఆరోగ్య సమస్యలను పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. షాను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు బీజేపీపై ఆరోపణలు గుప్పించాయి. 

మమ్మల్ని టార్గెట్ చేశారు.. 

బాహుబలి షా అరెస్ట్‌పై ఆయన సోదరుడు శ్రేయాన్ష్ షా స్పందించారు. ‘అవును షాను ఈడీ ఓ పాత కేసులో అరెస్ట్ చేసింది. మమల్ని టార్గెట్ చేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత అరెస్టే.’ అని అన్నారు. గుజరాత్‌లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఒకటిగా కొనసాగుతున్న గుజరాత్ సమాచార్‌ను బాహుబలి షా, ఆయన సోదరుడు శ్రేయాన్ష్ షా 1932లో స్థాపించారు.

అహ్మదాబాద్‌లో ఈ పత్రిక ప్రధాన కార్యాలయం ఉంది. కేవలం గుజరాత్‌లో మాత్రమే కాకుండా ముంబై, న్యూయార్క్ వంటి నగరాల్లో కూడా ఈ పత్రికకు మంచి పేరుంది. ఈ పత్రికకు బాహుబలి షా సోదరుడు శ్రేయాన్ష్ షా మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. కేవలం ఈ పత్రికలో మాత్రమే కాకుండా ఇంకా అనేక కంపెనీల్లో కూడా షాకు వాటాలున్నాయి. లోక్ ప్రకాశన్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న షా గుజరాత్ సమాచార్ పత్రికతో పాటు జీఎస్‌టీవీ చానల్‌ను కూడా కలిగి ఉన్నారు. 

అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్.. 

గుజరాత్ సమాచార్ సహవ్యవస్థాపకుడు బాహుబలి షా అరెస్ట్ అనంతరం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ‘కేవలం ఒక పత్రిక గొంతును అణచివేయడం మాత్రమే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం గొంతును అణచివేసేందుకు జరిగిన కుట్ర.’ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఇది బీజేపీ నిరాశకు సంకేతం. నిజాలు మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగేవారిని బీజేపీ ఎప్పుడూ నిశబ్ధంగా ఉంచాలని అనుకుంటోంది.’ అని కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. 

గంటల్లోనే బెయిల్..

గుజరాత్ సమాచార్‌కో ఓనర్‌ను ఈడీ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన గంటల్లోనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 73 ఏండ్ల షా అరెస్ట్ తర్వాత అనా రోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ఠ్యా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.