calender_icon.png 28 January, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన నాయగన్‌కు మళ్లీ చుక్కెదురు

28-01-2026 12:38:55 AM

‘జన నాయగన్’ సినిమాకు మళ్లీ చుక్కెదురైంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును మద్రాసు హైకోర్టు పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలంటూ తిరిగి సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు తన వాదనలు వినిపించడా నికి న్యాయపరమైన అవకాశాలు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు మంగళవారం సూచించింది.

ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైందా.. కాదా..? అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగినవిధంగా మరోసారి విచారణ చేసి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని స్పష్టంచేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీని విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించా లని చిత్ర నిర్మాతలకు సూచించింది. జనవరి 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలంటూ మంగళవారం సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది.