calender_icon.png 28 January, 2026 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిట్‌మెంట్ ఇవ్వకపోతే మహిళలకు అవకాశాలు రావు!

28-01-2026 12:41:14 AM

‘సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది. మనం ఏం ఇస్తే అదే తిరిగి ఇస్తుంది. అందుకే అక్కడ అవకాశాల కోసం వేరే దారులు తొక్కాల్సిన అవసరం లేదు. మనం నిబద్ధతగా ఉండాలి. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్‌లాంటివి ఉండవు’ అంటూ అగ్ర నటుడు చిరంజీవి ఇటీవల ఓ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో స్పందించారు.

ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. “సాధారణంగా కమిట్‌మెంట్ అంటే వృత్తిపరమైన నిబద్ధత అని అర్థం. కానీ, చిత్ర పరిశ్రమలో కమిట్‌మెంట్ అనే పదానికి అర్థం వేరు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉంది. శరీరాన్ని అప్పగించకపోతే మహిళలకు ఇక్కడ అవకాశాలు రావు. మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడమనేది పురుషులకు సర్వసాధారణమైపోయింది. చిరంజీవి తరం వేరు. అప్పుడు గౌరవప్రదమైన సంబంధాలుండేది. ఇప్పుడు దారుణంగా మారిపోయాయి.

ఒక ఫిమేల్ మ్యూజిషియన్‌ను స్టూడియోలో లైగికంగా వేధించానికి ప్రయత్నిస్తే ఆమె సౌండ్ బూత్‌లో తనను తాను లాక్ చేసుకుంది.  తర్వాత ఆ గాయని ఈ రంగాన్నే వదిలేసింది. నేను కూడా ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నా.  చిత్ర పరిశ్రమ ఎప్పటికీ అద్దం లాంటిది కాదు. ఇక్కడ అవకాశాలు పొందాలంటే సెక్స్ కోరుకునే పురుషులే పెద్ద సమస్య” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది చిన్మయి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.