25-09-2025 12:39:06 AM
దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై భైఠాయించిన నిరుద్యోగులు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకులు బుధవారం దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై మెట్రోస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
నిరుద్యోగుల ధర్నాతో దిల్ సుఖ్ నగర్ లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో సరూర్ నగర్ పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... 2024 అక్టోబర్ నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగా విద్యుత్ సంస్థలో ఏఈ, ఎస్‌ఈ, జేఎల్‌ఎం పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం 108 స్థానంలో కొత్త జీవోను ఏర్పాటు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ జాబ్ క్యాలెండర్, గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలు ప్రభుత్వ వైఫల్యం కారణంగా గత సంవత్సరం కాలంగా నష్టపోతున్న.
విద్యార్ధి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ జేఏసీ నాయకుడు అశోక్ కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 50 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.