11-11-2025 08:21:39 PM
ఎంపీని కోరిన టీయూడబ్ల్యూజే నాయకులు..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతిపత్రం అందచేశారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారిలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించాయన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో రాయితీతో కూడిన ప్రయాణానికి జర్నలిస్టులకు బస్సు పాసులు అందజేస్తుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాసులను అందజేసేదని వాటిని గత 3 సంవత్సరాల క్రితం రద్దు చేశారన్నారు. వివిధ కారణాలతో రద్దుచేసిన జర్నలిస్టు రైల్వే పాసులను పునరుద్ధరించేందుకు కృషి చేయాలని ఎంపీ ని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ అరవింద్ రైల్వే పాసుల పునరుద్ధరణ విషయం రైల్వే మంత్రి, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ ని కలిసిన వారిలో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టులు రాజేందర్ రెడ్డి, ఆనంద్, వంశీకృష్ణ, చింత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.