13-08-2025 12:27:39 AM
మంచిర్యాల, ఆగస్టు 12 (విజయక్రాంతి) : జిల్లాలోని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్‌సి) ఇన్‌చార్జి జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాసులు లంచం తీసుకుంటూ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నూరు మండలం అంగరాజు పల్లి పిహెచ్ సిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాసులు కోటపల్లి పీహెచ్సీకి ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
ఇక్కడే విధులు నిర్వహిస్తున్న ఫిర్యాదుదారుడికి సంబంధించిన రెండు నెలల డీఏ బకాయిల బిల్లులు సిద్ధం చేసి, డీడీవోకు సమర్పించేందుకు గడియారం శ్రీనివాసులు లంచం డిమాండ్ చేయగా అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం నస్పూర్ ప్రాంతంలోని కలెక్టరేట్ కార్యాలయం రోడ్డు వద్ద ఫిర్యాదుదారుడు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
లంచం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల అనంతరం శ్రీనివాసులును అరెస్ట్ చేసి కరీంనగర్లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఆదిలాబాద్ ఏసిబి డి.ఎస్.పి మధు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే, తక్షణమే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీసీపీ మధు ప్రజలకు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. వాట్సాప్ నంబర్ 94404 46106, ఫేస్‌బుక్‌లో తెలంగాణ ఏసీబీ, ట్విటర్‌లో @తెలంగాణ ఏసీబీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.