13-08-2025 12:28:04 AM
ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రి జూపల్లి ఆదేశం
నాగర్కర్నూల్, ఆగస్టు 12 (విజయక్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉండడాన్ని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనర్హుల పేర్లను తొలగించారు. మంగళవారం కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుకాయిపల్లిలో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.
గ్రామసభలో లబ్ధిదారుల ఎంపికపై ప్రజాభిప్రాయం సేకరించగా ఎంపికైన 20 మందిలో నలుగురు అ నర్హులు ఉన్నారని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, అనర్హుల పేర్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశిస్తూ అనర్హుల పేర్లను చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఎంపిక ప్రక్రియ సాగాలని తొలి దశలో 20 ఇం డ్లు, త్వరలోనే మరో 20 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తామన్నారు.
అంతకుముందు గురుకులాలను సందర్శించిన ఆయన అక్కడి విద్యార్థులకు అందిస్తున్న మెనూ, పరిసరాలు పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. తల్లిదండ్రులను చూడక చాలా రోజులు అవుతుందని బాధపడుతున్న ఒక విద్యార్థిని దగ్గరకు చేరదీసి తన తల్లిదండ్రులతో మంత్రి నేరుగా మాట్లాడారు. అధైర్య పడవద్దని మంచిగా చదువుకొని ఉన్నత స్థితికిరావాలన్నారు.