09-05-2025 01:45:05 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, మే 8 (విజయ క్రాంతి): జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ శాఖ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్లు, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉతీర్ణత శాతం పెంచాలని అన్నారు.
గత 10సంవత్సరాలలో ప్రశ్నా పత్రాలలో వచ్చిన ముఖ్యమైన పాఠ్యాంశాలను అభ్యాసన చేయించి సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ వారం రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి స్టాఫ్, లెక్చరర్ కు కళాశాలలో జరిగే అడ్మిషన్స్ పై లక్ష్యాలను కేటాయించాలని తెలిపారు. కళాశాల సాధించిన మెరుగైన ఫలితాలు, మన దగ్గర ఉన్న నాణ్యమైన లెక్చరర్స్ వసతులను వివరిస్తూ అడ్భిషన్స్ పెంచాలని అన్నారు.
కళాశాలల అనుమతులు, అఫిలేషన్ రెన్యూవల్ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమీప రోడ్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్ రావు, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి భారతి, విద్యా, ఫైర్ శాఖల అధికారులు, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.